కొత్తగూడెంలో 727 కిలోల గంజాయి పట్టివేత

కొత్తగూడెంలో 727 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 727 కిలోల గంజాయిని కొత్తగూడెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. పట్టణంలోని శేషగిరి నగర్​లో వాహన​తనిఖీలు చేస్తుండగా, లారీలో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.3.64 కోట్లు ఉంటుందని ఎస్పీ బి.రోహిత్​ రాజు తెలిపారు. ఏపీలోని చింతూరు నుంచి ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాకు శివం గుప్తా అనే వ్యక్తి సూచనల మేరకు భురి సింగ్, రవి కుమార్​ లారీలో గంజాయి తీసుకెళ్తున్నారని తెలిపారు.

లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో గంజాయిని పెట్టారు. కొర్రా సీతారాములు, వంతాల విశ్వనాథ్, వంతాల బాబూరావు, చిన్నారావు, సాయిబాబు, శంకర్​రావు, భద్రి వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. భురి సింగ్, రవి కుమార్​లను అరెస్ట్​ చేశామని తెలిపారు. గంజాయిని పట్టుకున్న సీఐ కరుణాకర్, ఎస్సై విజయ, సీసీఎస్​ ఇన్స్​పెక్టర్​ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.